Wednesday, 24 July 2013

బుజ్జి బజ్జీలు

బుజ్జి బజ్జీలు

ఎటుచూసినా వర్షాలే. ఈ వర్షానికి వేడివేడిగా ఏమైనా తినాలని అందరికి తప్పకుండా అనిపిస్తుంది. అందులో ముందుగా గుర్తొచ్చేది, అందరూ ఇష్టపడేది మిరపకాయ బజ్జీయే. వేడివేడి బజ్జీలు తింటూ వర్షాన్ని ఆస్వాదిస్తుంటే ఆ ఆనందమే వేరు. అయితే కొందరికి మిరపకాయ బజ్జీలు పడవు. అయితే మాత్రం బజ్జీలు తినటం మానేస్తామా. కానీ కాస్త వెరయిటీ మార్చి బీరకాయతోనో, అరటికాయతోనో, వాము ఆకులతోనో, వంకాయతోనో, క్యాబేజీతోనో బజ్జీలు వేసుకుని ఆరగించేయమా! అందుకే  రకరకాల కాయగూరలతో బజ్జీల వెరైటీలు ఈవారం 'రుచి'లో మీకోసం.
మిరపకాయతో...
కావలసినవి
మిరపకాయలు-పావుకేజి, శనగపిండి-పావుకేజి
తినేసోడా-చిటికెడు, ఉప్పు-తగినంత
వాము-సరిపడినంత, నూనె-100గ్రా
తయారుచేసే విధానం
ముందుగా మిర్చిలో కూరటానికి వాము, ఉప్పు కలిపి దంచి మసాలా తయారుచేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి తీసుకుని చాకుతో లేదా పిన్నీసుతో నిలువుగా గీరి మరిగిన నీటిలో వేసి ఒక ఉడుకురానిచ్చి తీసివేయాలి. తరువాత ఒక్కొక్క దానిలో నూరిన వాము, ఉప్పు మిశ్రమాన్ని కూరి ఉంచాలి. ఒక బేసిన్‌లో శనగపిండి, తగినంత ఉప్పు తినేసోడా తగినంత నీరు పోసి జారుగా కలపాలి. బాండీలో నూనె కాగిన తరువాత మిర్చి ముచ్చికను పట్టుకుని శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేసి ఒకవైపు రానిచ్చి పక్కన ఉంచి తీయాలి.

క్యాబేజీ రేకులతో...
కావలసినవి
శనగపిండి-అరకేజి, మైదాపిండి-300గ్రా.
బియ్యంపిండి-200గ్రా, ఉప్పు-కొద్దిగా
సోడా ఉప్పు-చిటికెడు, నూనె-వేయించటానికి సరిపడా
కారం-ఒక స్పూన్‌, క్యాబేజి రేకులు-కొద్దిగా
తయారుచేసే విధానం
క్యాబేజీ రేకులను మీడియం సైజులో ముక్కలు కోసి ఉంచుకోవాలి. తరువాత అన్ని పిండిలను కలిపి బాగా కలిపి ఉంచాలి. పిండి బాగా నానిన తరువాత క్యాబేజీ ముక్కలను అందులో ముంచి బాండీలో నూనె వేసి అది కాగిన తరువాత క్యాబేజీ ముక్కలను వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇది రెండు రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలకు ఎంతో పోషకాహారం కూడా.

బీరకాయతో...
కావలసినవి
బీరకాయలు-250గ్రా
శనగపిండి-500గ్రా
బియ్యంపిండి-300గ్రా
ఉప్పు-రుచికి సరిపడ
సోడాఉప్పు-కొద్దిగా
నూనె-వేయించటానికి సరిపడా
వాము-రెండు స్పూన్లు
తయారుచేసే విధానం
ముందుగా బీరకాయలను పై తోలు తీసి చిన్న ముక్క లుగా రౌండ్‌గా కోసి ఉంచుకోవాలి. శనగపిండిని, బియ్యంపిండిని, ఉప్పు, సోడా ఉప్పు కలిపి ఉంచాలి. బాండీలో నూనె వేసి కాగిన తరువాత ఒక్కొక్క ముక్కలను వేసి తీయాలి. ఇవి ఒక్క రోజు మాత్రమే నిల్వ ఉంటాయి.

వంకాయతో...
కావలసినవి
వంకాయలు-150గ్రా., శనగపిండి-250గ్రా
బియ్యంపిండి-250గ్రా, కారం-ఒక స్పూన్‌
ఉప్పు-రుచికి సరిపడినంత, సోడాఉప్పు-కొద్దిగా
కొత్తిమీర- అరకప్పు తరుగు, నూనె-250గ్రా.
తయారుచేసే విధానం
ముందుగా వంకాయలను రౌండ్‌గా ముక్కలుగా తరిగి ఉప్పు నీటిలో వేయాలి. శనగపిండి, బియ్యంపిండి కారం, ఉప్పు, సోడా ఉప్పు, కొత్తిమీర తరుగు పక్కన ఉంచుకోవాలి.  స్టౌమీద బాండీ పెట్టి నూనె కాగిన తరువాత వంకాయ ముక్కలను కలిపిన పిండిలో ముంచి దానిలో వేయాలి. ఇవి ఒక రోజు నిల్వ ఉంటాయి. వంకాయలను కాయలుగా కూడా బజ్జీలో వాడుకోవచ్చు.

పనీర్‌తో...
కావలసినవి
పనీర్‌-400గ్రా., శనగపిండి-300గ్రా
అల్లం,వెల్లుల్లి పేస్టు-ఒక చెంచా, తినేసోడా-చిటికెడు
ఉప్పు-రుచికి సరిపడా, నూనె-250గ్రా
కారం-ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర-ఒక కట్ట
తయారుచేసే విధానం
ముందుగా పనీర్‌ను రెండు అంగుళాల పొడవు ఒక అంగుళం వెడల్పు ఉండేటట్లు చాకుతో కోసి ఒక పళ్లెంలో ఉంచాలి. గిన్నెలో శనగపిండి అల్లం, వెల్లుల్లి కారం, కొత్తిమీర తినేసోడా, తగినంత ఉప్పు కలిపి నీళ్లు పోసి బజ్జీల పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో వేసి  ఎర్రగా వేయించాలి. పిల్లలకు ఇవి స్నాక్స్‌గా ఇవ్వడానికి బాగుంటాయి.

అరటికాయతో...
కావలసినవి
శనగపిండి-రెండు డబ్బాలు, అరటికాయలు-2
బియ్యంపిండి-కొద్దిగా, తినేసోడా-కొంచెం
ఉప్పు-రుచికి సరిపడా, కారం-ఒకచెంచా
నూనె-వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ముందుగా బేసిన్‌లో శనగపిండి, తినేసోడా, కారం, నీరు పోసి జారుగా కలుపుకోవాలి. అరటికాయ చెక్కు తీసి పల్చటి చక్రాలుగా గాని పొడుగు బద్ధలుగా గాని కోసి నీళ్లలో వేసుకుని ఉంచాలి. బాండీలో నూనె పోసి బాగా కాగిన తరువాత ఒక్కొక్క బద్దని తీసుకుని శనగ పిండిలో ముంచి నూనెవేసి దోరగా వేయించుకోవాలి.

Wednesday, 3 July 2013

జుట్టు నల్లగా ఉండాలంటే...

జుట్టు నల్లగా ఉండాలంటే...
HAIR_KING 
 
ఇప్పుడు ఎన్ని రకాల హెయిర్‌ డైలు, కలరింగ్‌లు వచ్చినా అమావాస్య చీకటంత నల్లగా నిగనిగలాడుతూ కురులు ఉండాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. సహజంగా ఉంటే జుట్టు ఎర్రబారుతుందని అనిపించినప్పుడు ఈ చిట్కా ప్రయోగిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. త్రిఫల చూర్ణాన్ని గ్లాసుడు నీళ్లలో కలిపి రాత్రంతా ఉంచేయండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా వేడి చేసి చల్లారిన తరువాత తాగండి. అలాగే కొబ్బరినీళ్లు, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని తలకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు నడినెత్తిన మసాజ్‌ చేయండి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు పొరవిప్పిన నల్లతారులా నిగనిగలాడుతుంది. ప్రయత్నించి చూడండి.

వంటింటి వైద్యం రామ ములుగ

వంటింటి వైద్యం రామ ములుగ
tomato 
మూత్రంలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలనుకునే వారు ప్రతి రోజూ ఉదయం పూట రామములగ పండు ఒక్కటి తింటే దానిలో సమృద్ధిగా ఉండే ఆమ్లాలు, విట మిన్‌ ఎ, సి, రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతాయి. ప్రతిరోజూ ఖాళీకడుపుతో రెండు మూడు రామములగ పళ్ళు తింటే రెండు మూడు నెలల్లోనే అతి బరువు తగ్గించుకోగలుగుతారు. ఇంకా శరీరానికి కావాల్సిన అన్ని పోషకపదార్థాలు లభిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ పై విధంగానే తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఆరోగ్యానికి చిట్కాలు

ఆరోగ్యానికి చిట్కాలు
 
 
జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు, రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి

గొరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాడితే జ్వరం తగ్గుతుంది.

ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని, వేడి పదార్ధాలకు బదులు చలవ పదార్ధాలు తింటే మంచిది.

జలుబు, దగ్గు తగ్గాలంటే రెండు తమల పాకులు , మూడు వేయించిన లవంగాలు, ఐదు గ్రాముల అతిమధురం ,ఐదు గ్రాముల వాము, చిన్న కరక్కాయ ముక్క దంచి రసం తీసి రోజుకు మూడు సార్లు తాగాలి.

ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్‌ తుమ్మి ఆకు రసంతోపాటు రెండు టీ స్పూన్ల తేనెనుకలిపి రోజుకు రెండు సార్లు కళ్లలో వేయాలి. ఇలా మూడు రోజులు వేస్తే పచ్చకామెర్లు తగ్గుతాయి.‚
పంటి నొప్పితో బాధపడే వారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది.

ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్య చిట్కాలు
 ginger 
జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇనెఫెక్షన్‌ బాధ నుంచి బయట పడవచ్చు.

అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇందులో చిటిెకడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.

ప్రతీరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనెఫెక్షన్‌ తగ్గుతుంది.

చిట్కాలు....

చిట్కాలు....
 
kira 
 
కీరదోస మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. రక్తపోటులో తేడా ఏర్పడిన వారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి. కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలుగా తొలగించగలవు. కళ్ళు ఉబ్బినట్లు ంటే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్‌ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుంది. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులో సల్ఫర్‌, సిలికాన్‌ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి. దోసరసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీరా బాగా పని చేస్తుంది. దోసను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ ‘కె’ సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు.

చర్మం నల్లబడుతుంటే...

చర్మం నల్లబడుతుంటే...
 
beaturyకొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరీ ముఖ్యం గా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టం గా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్తే చాలు...చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్లబడు తుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడుతా యి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్‌ సమస్య లుగా చెబుతుంటారు.

హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌ సంబంధిత సమ స్యలు, దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మం దుల కారణంగా, శిరోజాలకు క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగ్మంటేషన్‌ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సూర్యుడి అతి నీల లోహిత కిరణాల వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. ఆరంభదశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది.

కొన్ని చిట్కాలు...
1. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.
2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి.
3. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్‌క్రీమ్‌ లోషన్‌ ముఖానికి రాసుకోవాలి.
acharya4. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తరువాత చన్నీళ్ళతో స్నానం చేయాలి.
5. కొంచెం క్యారెట్‌, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్‌ కలిపి మిక్సర్‌లో వేసి పేస్ట్‌గా తయారు చేసి, దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
6. పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్‌ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.