సహనమే ఆవేశానికి మందు
తమ భావోద్రేకాలు నియంత్రించుకొంటూ సరైన మార్గంలో వినియోగించుకోగలిగిన వాళ్ల
జీవితాలు ప్రశాంతంగా, విజయవంతంగా ఉంటాయి. అది చేతగాని అసమర్థులకు జీవితంలో
అపజయాలు అధికమవుతుంటాయి. మనకు ఇష్టమైన రీతిలో మన అభిప్రాయాలు
ఏర్పరచుకొంటూ ఉంటాం. ఎదుటి వ్యక్తులు మన అభిమతానికి అనుకూలంగా మెలగనప్పుడు,
పరిస్థితులు సహకరించనప్పుడూ మనలో అసహనం, అసంతృప్తి చోటు చేసుకొంటాయి.
ఎమోషన్స్ విజృంభిస్తాయి. ప్రతి మనిషినీ, ప్రతి పరిస్థితినీ మనం ఆశించిన
విధంగా మార్చుకోవాలనీ ప్రయత్నం చేస్తూ ఇబ్బందుల పాలయ్యే బదులు, మన
వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవడం తేలికైన పని. తెలివైన పని కూడా.
కొన్ని పరిస్థితులను మార్చడానికి వీలుకాకపోవచ్చు. కష్టం కావచ్చు. కాని, మన
ఆలోచనలను, అభిప్రాయాలను సందర్భోచితంగా మార్చుకోవడం, సమయోచితంగా
వ్యవహరించడం మన చేతుల్లో ఉన్న పని.
ఆవేశాలను నిరోధించుకోవడం, నియంత్రించుకోవడం మనకు చేతనైన పని. అన్ని వేళలూ,
అన్ని పరిస్థితులూ మనకు అనుకూలంగా ఉండవు. విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు
ఆవేశాలు ప్రదర్శించి అనర్థాలు కొని తెచ్చుకోవడం కంటే, సమయానుకూలంగా
అణగిమణగి ఉండడం శ్రేయస్కరం. వివేకవంతులు అనుసరించే ఉత్తమమార్గం ఇది.
ఆవేశంతో వ్యవహరిస్తున్న వాళ్లతో వాదించడం, వాళ్లను ఒప్పించి
మెప్పించడానికి ప్రయత్నించడం వృథా ప్రయాస. ఉద్రేకంతో ఉన్నప్పుడు మనుషుల
ఆలోచనలు వక్రమార్గం పడతాయి. తాము నమ్మిందే న్యాయమని, తాము అనుకొన్నదే
యధార్థమని నిర్ణయాలకు వస్తారు. ఎదుటివాళ్లు ఎంత హేతుబద్ధంగా వాదించినా, ఎంత
నమ్రతతో నచ్చజెప్పినా వాళ్లు తమధోరణి మార్చుకోరు. అలాంటి స్థితిలో
వాళ్లతో వాదోపవాదాలకు దిగితే, సహనం కోల్పోయి మనం కూడా భావోద్వేగాలకు
బానిసలయ్యే ప్రమాదం ఏర్పడవచ్చు. పరిస్థితి విషమించవచ్చు. అంచేత ఉద్విగ్నుడై
ఉన్న మనిషిని ఉపశమింపజేసే ప్రక్రియగా తాత్కాలికంగా అతనితో ఏకీభవించి, తల
ఊపడం ఒక మార్గం. లేదా మౌనం వహించి దూరంగా వెళ్లిపోవడం రెండవ విధానం. అతడు
అక్కసు వెళ్లగ్రక్కి, శాంతించిన తర్వాత విషయాలను చర్చించుకొంటే ప్రయోజన
చేకూరుతుంది. మనుషుల పట్ల, సమాజం పట్ల, జీవితం పట్ల మనకు అర్థవంతమైన
అవగాహన అవసరం. మన ఆలోచనలు లోప పూరితంగా ఉంటే మనలో అపార్థాలు పెరుగుతాయి. మన
మానవ సంబంధాలు దెబ్బతింటాయి.
హానికర భావోద్రేకాలకు బానిసలయ్యే వ్యక్తుల అవలక్షణాలివే:
- విషయాలను, పరిస్థితులను సరిగా, సహేతుకంగా అర్థం చేసుకోలేకపోవడం.
- మనుషుల పట్ల అనుసరిస్తున్న వైఖరిలో లోపం ఉంచటం.
- సమాజం, జీవితం మీద ఏర్పరచుకొన్న దృక్పథంలో దోషాలు దొర్లడం.
- నమ్మకాలు, విశ్వాసాలు అర్థం లేనివి, కాలం చెల్లినవి కావడం.
- మంచిని చూడాలనుకొంటే మనం అన్ని విషయాలలో మంచినే చూడ వచ్చు. వక్రదృష్టితో చూస్తే ప్రతి అంశంలోనూ చెడును వెతికి వెలికి తీయవచ్చు.
నెగటివ్ దృక్పథాలు ఏర్పరచుకొని వ్యవహరిస్తే కామెర్ల కళ్లతో ప్రపంచాన్నీ, ప్రజలను చూడడం జరుగుతుంది.
హానికర ఆవేశాలు పెంచుకుని అనర్థాలను ఆహ్వానించడం సంభవిస్తుంది. ఆవేశాలను అదుపులో ఉంచుకుని వ్యవహరించే లక్షణాలివే:
- ఉద్రేకానికి లోనవుతున్న పరిస్థితులలో ఆవేశాన్ని అణచుకోవాలి. ఆలోచనకు
అగ్రాసనం వేయాలి. తొందరపాటుకు స్వస్తిచెప్పి, ఒక నిమిషం ఆత్మావలోకనం
చేసుకోవాలి.
- మన భావోద్వేగం మనకు ప్రయోజనకరంగా ఉంటుందా లేక ప్రమాదకరంగా పరిణమిస్తుందా అని సమీక్ష చేసుకుని ఆ పైన అడుగు ముందుకు వేయాలి.
- అప్పటి పరిస్థితులను, సందర్భాలను వివేకవంతంగా అంచనా వేసు కోవాలి.
సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎదుటివాళ్ల అభిప్రాయాలను గౌరవించి అర్థం
చేసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
- ఉద్వేగ ప్రజ్ఞను సాధించుకొన్నప్పుడు భావోద్రేకాలు మనకు బానిసలుగా
మారతాయి. సమస్యలు మన ముందు సాగిలపడతాయి. మనం సమర్థ వంతులుగా ఎదుగుతాము.
- ఉద్వేగ పరిణతి మనకు ఒకనాటితో వచ్చే విద్య కాదు. పుస్తకం చదివి
నేర్చుకొనే పరిమితి పాఠ్యాంశం కాదు. ఈ విషయంలో మనకు జీవితమే పాఠ్య
పుస్తకం. ప్రపంచమే పాఠశాల. సమాజంలోని ప్రతి వ్యక్తీ ఒక ఉపా ధ్యాయుడే.
డిగ్రీలతోను, డాక్టరేట్లతోనూ నిమిత్తం లేకుండా జీవితానుభవం ద్వారా సంగ్ర
హించుకోవలసిన సున్నితమైన విద్య ఇది.
- సత్సాంగత్యంతోను, సద్గ్రంధ పఠనంతోను విజ్ఞత పెంచుకొంటూ అనుభవాల నుంచి
అర్థవంతమైన పాఠాలు నేర్చుకొంటూ దుర్గుణాలు విసర్జిస్తూ సుగుణాలు
సమకూర్చుకొంటూ ఆవేశాల పైన అదుపు సాధించిన వాళ్లకే ఈనాటి పోటీప్రపంచంలో
ఉజ్జ్వలమైన జీవితం లభ్యమవుతుంది. ఆవేశపరులు అధికమవుతున్న నేటి సమాజంలో
సహనగుణం, సర్దుబాటు స్వభావం స్వంతం చేసుకొన్న విజ్ఞులకు ఏ రంగంలోనైనా
సమున్నతంగా ఎదగడం సులభమవుతూ ఉంది.
No comments:
Post a Comment